హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ రుజువైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే తెలంగాణలోని ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్, జగన్ కలిసి పని చేస్తున్నారని తాము చెబుతూనే ఉన్నామని, అది ఈ రోజు రుజువైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పామని, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని, తాము అఖిలపక్ష సమావేశానికి వెళ్లబోమని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీది, కేంద్ర ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణపై తమను లక్ష్యం చేసుకున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్, ఇసుక తదితర మాఫియాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆయన అన్నారు. మహిళల దుస్తులపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన ప్రకటన సరైంది కాదని, ఇటువంటి ప్రకటనలు మానేసి డిజిపి శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. 2011లో ప్రజలకు అన్నీ ఇబ్బందులే కలిగాయని, 2012లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. 2012లో తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
విద్యుత్ సమస్యను, ధరల పెరుగుదలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయిందని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల భారం మోపిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls